నియోజకవర్గ పెంపు ఫైల్‌పై సంతకం చేసిన ‘మోడీ’

NEWS

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని ‘మోడీ’ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే వివిధ కారణాలతో గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గాల పెంపు పెండింగ్‌లో ఉంది. అయితే…ఈ రోజు ఉదయం ‘మోడీ’ నియోజకవర్గాల పెంపుకు ఓకే చేస్తూ…సంబంధిత ఫైల్‌పై సంతకం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ ఆమోదం తరువాత.. వెంటనే ఫైల్‌ ఎన్నికల కమీషన్‌కు వెళుతుంది. అదే సమయంలో రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించి చట్టసవరణ బిల్లును ప్రవేశపెడతారు. దీన్ని ఆమోదించడం లాంఛనమే. ఎందుకంటే…బిజెపి, కాంగ్రెస్‌లు రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గాల పెంపుకు అంగీకారం తెలిపాయి. దీంతో..ఇప్పుడు ఆ చట్టసవరణకు ఎటువంటి ఆటంకాలు వచ్చే..అవకాశం లేదు. సభ ఆమోదం పొందిన తరువాత ..ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 225 సీట్లు అవుతాయి… తెలంగాణలో ఉన్న 119 సీట్లు 175కు పెరుగుతాయి. మొత్తం మీద మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పెంపుకు ప్రధాని ఆమోదించడం ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు మేలు చేయబోతోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..ప్రధాని మోడీతో సమావేశమైన సందర్భంలో నియోజకవర్గాల పెంపుపై గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని..ఈ విషయంపై ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నట్లు జరుగుతున్నపరిణామాలు తెలియజేస్తున్నాయి. నియోజకవర్గాల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాని హామీ లభించిన తరువాతే..ఆయన ఈ విధంగా ప్రకటిస్తున్నారని టిడిపి సీనియర్‌ నాయకులు అంచనా వేశారు. నిన్న జరిగిన టిడిపి వర్క్‌షాప్‌లో కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గాల పెంపుపై నాయకులకు నొక్కి చెప్పారు.కాగా..నియోజకవర్గాల పెంపుతో..టిడిపి, టిఆర్‌ఎస్‌లకు భారీగా లబ్ది చేకూరబోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోని అధికారపార్టీలు విపక్షాల్లోని శాసనసభ్యులను పార్టీలో చేర్చుకున్నారు. వారు పార్టీలో చేరడంతో..ఇంతకు ముందు పార్టీలో ఉన్న నాయకులకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకదేమోనని చాలా మంది నాయకులు ఆందోళన చెందారు. ప్రస్తుతం సీట్లు పెంపు ఓకే కావడంతో..వారిలో నెలకొన్న ఆందోళన తగ్గుముఖం పట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *